వాక్యసందేశముPost Date:2015-02-06//No:112

మనం ఆయనను ప్రేమించిన యెడల!ఆయనను కోరుకుంటాము : ప్రేమలో ఉన్న లక్షణం, తాను ప్రేమించే వ్యక్తి యందు ఆనందించడం. క్రైస్తవుడు క్రీస్తునందు ఆనందిస్తాడు! మన ఆశలు, ఆశయాలు, గురి, సంతోషం, సమస్తం ఆయన యందే ఇమిడి వుంటాయి. దేవుని కొరకు తృష్ణగొని యుంటాము (కీర్త42:2). ప్రేమికులు ఎప్పుడు ఒకరి పొందును ఒకరు కోరుకుంటారు. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు ఆయన సన్నిధిని కోరుకుంటాడు. ప్రాణప్రియుడైన ప్రభువు పొందు ఎంత ధన్యకరం. మరియ యేసుని ప్రేమించి ఆయన పాదాల దగ్గరే వుండేది (లూకా 10:38-42). ఆయన సన్నిధి కాంక్షించేది! ఆయన తప్ప లోకములోని దేదియు మనకు అక్కరగా వుండదు!! (కీర్త 73:25).

ఆయనలోనే సంతృప్తిని కలిగియుంటాము : మరి దేనిలోను సంతృప్తి చెందలేము. దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పే వేషధారికి రొట్టే నీరు ఇవ్వండి. దేవుడు లేకుండానే వాడు వాటితో సంతృప్తి చెందుతాడు. ఈనాడు ఇలాంటి వారు సంఘాల నిండా వున్నారు! దేవుని ప్రేమించేవాడు ఆరోగ్యం లేకపోయినా, ఆస్ధి లేకపోయినా, సుఖం లేకపోయినా, ధనం లేకపోయినా, పేరు ప్రతిష్టలు లేకపోయినా వుండగలడు గాని దేవుడు తనతో లేకుండా వుండలేడు. వేషధారి జీవన సంబంధమైన వస్తువులతో తృప్తి చెందుతాడు, జీవితానికి ప్రభువైన దేవునితో కాదు. మరియ ప్రభువు సన్నిధి కొరకు ఏడ్చింది. ఒకడు నా ఆరోగ్యం పోయిందని ఏడుస్తున్నాడు, ఒకడు నా ఆస్తి పోయిందని ఏడుస్తున్నాడు, ఒకడు నా హోదా పోయిందని ఏడుస్తున్నాడు, ఒకడు నా వ్యాపారం పోయిందని ఏడుస్తున్నాడు అయితే మరియ నా దేవుడు నా దగ్గర లేడే అని ఏడుస్తోంది!! (యోహాను 20:13). నిజ క్రైస్తవునికి సర్వదా సంతృప్తి తన ప్రభువైన యేసుక్రీస్తులోనే.

ఆయనను ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తాము : దేవుని ప్రేమించినప్పుడు ఆయన ద్వేషించు దానిని మనం ద్వేషిస్తాము. మన పాపం దేవుని ముఖం దాచుకునేట్టు చేస్తుంది. (యెషయా 59:1-2). అసహ్యపడేట్టు చేస్తుంది (కీర్త 119:128). కనుక ప్రభువును ప్రేమించేవారు పాపాన్ని పూర్ణ హృదయంతో ద్వేషిస్తారు. పాపం ప్రాణ స్నేహితుల్ని కూడా విడదీస్తుంది. వెలుగు చీకటి కలిసి యుండలేవు, తూర్పు పడమర ఎన్నటికీ కలవ లేవు. ఇనుము మట్టి ఒకటి కాలేవు. పరిశుద్ధుడికి పాపికి సహవాసముండదు. విషమును ద్వేషించనంత వరకు ఎవరూ ఆరోగ్యమును ప్రేమించలేరు. పాపాన్ని ద్వేషించనంతవరకు దేవుడిని ప్రేమించలేము (కీర్త 66:18). 'నేను పాప వ్యతిరేకిని, నా కాలు వున్నంత వరకు దాన్ని తంతాను. నా పిడికిలి వున్నంత వరకు దాన్ని గుద్దుతాను, నా తల వున్నంతవరకు దాన్ని ఢీ కొంటాను. నా పళ్ళు వున్నంతవరకు దాన్ని కొరుకుతాను. నేను ముసలివాడినై పిడికిలి లేక, కాలు లేక, పళ్ళు లేక యున్నప్పుడు నేను పరలోకానికి పాపం నరకానికి పోయేంతవరకు నా నోట దానిని మింగిపడతాను!' రోషంతో సువార్తికుడైన బిల్లీ సండే పలికిన మాటలు. ఖచ్చితముగా బిల్లీ సండే పాపాన్ని ద్వేషించాడు.

ఆయన గుణగణములను ప్రచురపరుస్తాము : ప్రేమికులు తమ ప్రియుల గూర్చి మాట్లాడుతునే వుంటారు! వారిని ఇతరుల ఎదుట పొగుడుతూ వుంటారు. ఘాలేమియురాలు తన ప్రియుని గూర్చి చేసిన ప్రశంస చెప్పుకోదగినది. 'నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులకన్న శ్రేష్టుడు' అని వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమని అడిగినవారికి చక్కగా జవాబు చెప్పింది. మనస్సంతా ప్రభువే వున్నప్పుడు మాటల్లో ప్రభు ప్రశంసే వుంటుంది. క్రీస్తు గుణాతిశయములను ఎల్లప్పుడును ఆయనను ప్రేమించేవాడు ప్రచురపరుస్తాడు (1 పేతురు 2:9). దేవుడిని నిజంగా ప్రేమించేవాడు ఆయన గూర్చి ప్రకటించకుండా నిశ్శబ్దంగా వుండలేడు.

  ఆయన ఆజ్ఞలను గైకొంటాము : 'నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు' (యోహాను 14:15) యేసు ప్రభువు సత్యమును స్పష్టంగా పలికారు. 'మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట' (1 యోహాను 5:3) అని బైబిల్‌ చెబుతోంది. దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు జీవిస్తారు. దేవుని ఆజ్ఞలను గైకొంటూ, ఆయన చిత్తము నెరవేరుస్తూ, ఆయనను వెంబడిస్తారు. ఆయనను సంతోషపరుచుటయే మన సంతోషంగా మారుతుంది. ఆయన చిత్తము చేయుటయే మనకు ఆశీర్వాదకరముగా వుంటుంది. ఆయన మాటల గైకొనుటయే మనకు సమృద్ధిగల జీవం. చివరికి ఆయన పక్షాన శ్రమపడుటకు కూడా సిద్ధమే. ప్రభువు సిలువలో మన పట్ల తన ప్రేమను వెల్లడి పరిచాడు. మనం విశ్వాస జీవితంలో ఆయన పట్ల మన ప్రేమను వెల్లడిపరచాలి!

పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో తన ప్రేమను కుమ్మరించి ప్రభువైన యేసు క్రీస్తును మీరు అపారముగా ప్రేమించునట్లు చేయును గాక! ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమింతుము (1 యోహాను 4:19). 'ఆయనను చూడక పోయినను ఆయనను ప్రేమించువారు ఎంత ధన్యులు'! (1 పేతురు 1:8).

- పి.ఉపేందర్‌
మనం