వాక్యసందేశముPost Date:2015-01-02//No:110

లోతునకు నడుచుట...గలిలయ సముద్రాన్ని గెన్నెసరెతు, తిబేరియా అని కూడా పిలుస్తారు. ఇది సహజంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. విస్తీర్ణాన్ని బట్టి ఇది సముద్రంగా పిలువబడుతుంది. దీని చుట్టుకొలత 53 కి.మీ. దీని పొడవు 21 కి.మీ; వెడల్పు 13 కి.మీ. దీనిలోని చేపలు ఖరీదైనవే కాకుండా రుచికరమైనవి కూడా. ప్రభువు వారి 7గురు శిష్యులు కూడ ఇక్కడ చేపలు పట్టేవారే. వారి పరిచర్య ఎక్కువగా ఈ సముద్రం చుట్టూ జరిగింది.

ఈ సముద్రంలోనే యేసు, పేతురు, యాకోబు, యోహానులను ఉద్దేశించి, (లూకా 5:4). 'నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలల వేయుడని' వారు చేపలు పట్టుటలో విఫలులైనప్పుడు చెప్పెను.

ఈ జాలర్లు నిపుణులైనప్పటికి, రాత్రంతా వారి ప్రయాసం విఫలమయ్యింది. నిజానికి వారు నిరాశలో ఇంటికి వెళ్ళుటకు బయలుదేరిన సమయంలో ఆయన మాట చొప్పున చేసి విస్తారమైన చేపలు పట్టిరి (లూకా 5:6). అయితే ఈ రోజుల్లో లోతునకు వెళ్ళుట అను మాటకు అర్ధమేమిటి?

యేసు ప్రభువుతో లోతైన ప్రేమానుభవం : యేసుక్రీస్తు వారు పరిచర్య ఆరంభంలోనే 'దోనెను లోతునకు నడిపించుమని' ఆజ్ఞనిచ్చాడు. దానికి పేతురు విధేయుడగుట వలన విస్తారమైన చేపలు పట్టగలిగాడు. ఇందువలన సమస్తాన్ని విడిచి ఆయన శిష్యుడయ్యెను. తరువాత యేసు 'నన్ను ప్రేమిస్తున్నావా' అని మూడుసార్లు అడిగెను. (యోహాను 21:14-17) యేసు పునరుత్థానుడైన తరువాత పేతురు చేపలు పట్టుటకు పోయినప్పుడు కూడా చేపలు విస్తారముగా పడినవి. (యోహాను 21:6) ప్రభువు తిరిగి మూడుసార్లు 'నన్ను ప్రేమించుచున్నావా' అని అడుగుటవలన పేతురు మరింత లోతుగా యేసును ప్రేమించునట్లు చేసాయి.

ఈ రోజు మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు 'నా పట్ల నీ ప్రేమ ఎంతలోతుగా ఉన్నది?' ఆయన పట్ల మనకు లోతైన ప్రేమ ఉన్నట్లయితే అనేక ఆత్మలను ఆయన కొరకు పట్టెదము. ఆయన ప్రేమ 'అగాపే' ప్రేమ. మన కొరకు రక్తం కార్చారు. మనము ఇంకను ఆయన ప్రేమకు పాత్రులము కానప్పటికి మనకొరకు అవమానం సహించాడు, ఒంటరితనం అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు. నిందలు భరించాడు, చివరికి సిలువ మరణం పొందాడు. ఆయన మనలను ఎన్నడు విడువడు, ఎడబాయడు. పునరుత్థానుడైన క్రీస్తు మన ప్రతి అవసరము తీర్చును. ఆయన కృప చాలును. ఆయన ప్రేమ అపారమైనది, లోతైనది. (ఎఫెసి 3:18-19) దీన్ని మనం తిరిగి ఇవ్వగలమా? మనం ఏమి చేసినా హృదయపు లోతులలో నుండి రావాలి.

ఆయనను మనం ఎందుకు సేవిస్తున్నాము? ఈ భూమి మీద ఎందుకు నివసిస్తున్నాము అంటే కేవలము ఆయనను ప్రేమించుట కొరకే. మనం యేసుని మాత్రమే ప్రేమిస్తే మన కుటుంబాన్ని మనలను ప్రేమించే వారెవరూ అనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి సమాధానం ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎవరికీ అచ్చి ఉండేవాడు కాదు. అందుకే ఆయన ప్రేమలో లోతుగా వెళదాం. ఆ ప్రేమ మనలను మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తుంది. అందువలన ఆత్మలను ఆయన వద్దకు తీసుకొని రాగలము. ఒక్క ఆత్మను తీసుకొని వస్తే పరలోకం సంతోషిస్తుంది. ఆయన పాపులను రక్షించుటకు మరణించాడు. గనుక మనం ఆత్మలను ఆయన కొరకు తీసుకొని రానట్లయితే మన ప్రేమ ప్రశ్నార్ధకంగా ఉంటుంది. ఆయన కేవలం మనకొరకే కాదు అందరి కొరకు మరణించాడు. పరిశుద్ధ సహవాసం అందరిది. గనుక మనము ఆయన సువార్తను చాటుట ద్వారా ఆయన పట్ల మనకు గల లోతైన ప్రేమను కనపరచుదాం. అనేకమంది మిషనరీలు వారి ప్రదేశాలను వదిలి మారుమూల అరణ్య ప్రాంతాలలో సేవ చేయుటకు తరలి వచ్చారు. గ్రహంస్టెయిన్స్‌ మిషనరీ దేవుని ప్రేమించుట వలన యేసుకొరకు అమరవీరుడయ్యాడు. నీ ప్రేమ ఆయన పట్ల ఎంత ఉంది?

లోతైన ప్రార్ధనా జీవితం : సముద్రంలో చేపలు పట్టుటకు లోతుగా దిగిన పేతురు గెత్సెమనే తోటలో ప్రార్ధన చేయుటలో విఫలుడయ్యాడు. యేసు తనతో కూడ ప్రార్ధించమని కోరారు గాని ప్రార్ధించుటకు బదులు పేతురు నిద్రించాడు. (మత్తయి 26:40) ఇదే పేతురు అపో.కార్యములలో ప్రార్ధనావశ్యకతను గురించి మాట్లాడాడు (అపో.కా. 6:4) మేము ప్రార్ధించుట యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పెను. ప్రార్థించుట కొరకు ఇతరమైన పనులు మానేసాడు. ప్రార్ధనా పరుడైనాడు.

జీవితంలో ప్రార్ధన మరియు వాక్యధ్యానం అవసరము. సం||నికి ఒకసారిగాని రెండుసార్లుగాని బైబిలు పూర్తిగా చదువుట మంచిది. మా మిషనరీలలో ఒకరు సం||నికి రెండుసార్లు బైబిలు చదువుతారు. మనము వాక్యధ్యానము నేర్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం కనీసం ఒక గంటైనా మనం ధ్యానానికి కేటాయించాలి. ధ్యాన క్రమాన్ని తప్పకూడదు. వారానికి ఒకసారి వ్యక్తిగత ఉపవాస ప్రార్ధన చేసుకోవాలి. ప్రతిరోజు మిషనరీల కొరకు ప్రార్ధించాలి. దీనికిగాను |జూఖ మాసపత్రిక ప్రార్ధన అంశాలనందిస్తుంది. లోతైన ప్రార్ధనా జీవితం అనేక ఆత్మలను దరికి చేరుస్తుంది.


లోతునకు
లోతైన ఆత్మీయ జీవితం : లోతైన ప్రార్ధనా జీవితంతో పాటు, ఆత్మీయ జీవితం కూడ లోతుగా, అనగా యేసుని పోలిన జీవితమన్నమాట. 'నిన్ను' ఎంచుకున్నప్పటికీ నన్ను ఎరుగనని 3 సార్లు అన్నావు' అని కఠినంగా అనుటకు బదులుగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా' అని మృదువుగా అడిగారు (యోహాను 21:17). సమూహములు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి యుండుట చూచి కనికరపడెను. (మత్త 9:36) యేసు అత్యంత ప్రేమామయుడు, సాత్వీకుడును, సాధువైనవాడు గనుకనే తన్నుతాను తగ్గించుకొని మనుష్యుల పాదాలు కడిగారు. లోతైన ఆత్మీయత మనలను క్రీస్తువలె మార్చి మనుష్యులను పట్టుజాలరులుగా చేస్తుంది. క్రైస్తవ మిషనరీలు క్రీస్తును పోలి నడుచుట ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నారు.

కొత్త ప్రాంతాలకు పరిచర్య విస్తరించడం : నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడ వెళ్ళుము (అపో.కా.10:20) అని పేతురుతో చెప్పెను. కొర్నేలి వద్దకు వెళ్ళమని దేవుడు పేతురుకు ఆజ్ఞాపించినప్పుడు అలాగే వెళ్ళాడు. అందువలన పరిచర్య అన్యజనులకునూ విస్తరించెను. అపోస్తలుల ద్వారా ప్రపంచంలో ఆయన పరిచర్య విస్తరించి చివరికి భారతదేశం కూడా చేరింది.

లోతుగా ప్రయాసపడటం : నెలకొకసారి మాత్రమే కాకుండా ప్రతి వారం నూతన గ్రామాలను దర్శించుటకు తీవ్రతరం చేయాలి. ఒక అనుభవజ్ఞుడు ఈ రీతిగా చెప్పాడు. 'ఒక వ్యక్తిని పదిసార్లు దర్శించి పరామర్శించినట్లయితే, ఆ వ్యక్తి ప్రభువును తెలుసుకొనుటకు అవకాశమెక్కువ' గనుక అట్టి ఆశ కలిగి వుందాము. తట్టుడి ద్వారం తెరువబడును. (మత్తయి 7:7). లోతైన సంబంధ బాంధవ్యాలు : పేతురు అనేకమైన చేపలు తీసుకొని వెళ్ళుటకు తన స్నేహితులను పిలిచాడు. చేపలతో నిండిన వలను లాగుటకు ఒక్కరి వలన జరుగదు (లూకా 5:7) సహవాసం, సంబంధాలను పెంచుకొనుట వలన అనేక ఆత్మలను సంపాదించవచ్చును. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో వారి మధ్యే నేనుందునని ప్రభువు చెప్పెను (మత్తయి 18:19). ఇంకా - ఏడుసార్లు కాదుగాని, డెబ్బది ఏడుమార్లు క్షమించవలెనని పేతురుతో చెప్పెను (మత్త 18:22). క్షమాగుణము, ఏకభావమును కలిగించి ఐక్యతను పెంపొందిస్తుంది. ప్రేమ పూర్వకమైన సంబంధం ఫలవంతమగును. సహోదరుని ప్రేమింపనివారు ఎలాగున దేవున్ని ప్రేమించుదురు? (1 యోహాను 4:20) ఆతిధ్యమిచ్చుట, దర్శించుట అనునది మంచి సంబంధాలు కలుగచేయును. మనస్సులోని మాటలను స్వేచ్ఛగా తెలియజేయుట వలన సమైక్యతకు సహాయపడును. సంబంధాలు లేనట్లయిన, తప్పించుకొని తిరుగుట వలన నేరుగా ఎదుర్కొనలేక వెన్ను పోటు పొడిచెదరు. గనుక తోటివారితో మంచి సంబంధం ఏర్పరచుకోవాలి.

లోతైన దేవుని పరిచర్యకు ధారాళముగా ఇచ్చుట : 5 రొట్టెలు, రెండు చేపలను; 5 వేల మందికి పంచిపెట్టుటను (లూకా 9:16-17), బర్నబా భూమిని అమ్మి దాని వెలతెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుటను (అపో 4:37) పేతురు ప్రత్యక్షంగా చూసాడు.

ఒకసారి మేము సువార్త దండయాత్రకు దూరముగా నున్న ప్రాంతానికి బయలుదేరాము. అప్పుడు ఒక కోయ సోదరుడు బస్తా ధాన్యమును అమ్మి రు.500/- ఇచ్చారు. అతనికి చెప్పులు సరిగాలేవు. ఆ డబ్బులతో అతను చెప్పులు కొనుక్కొని ఉండవచ్చును. కాని సువార్త కొరకు తనవంతు సాయం చేయాలని తన ఆశ. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించుటకు అవి వినియోగించబడినాయి. ఒకవేళ నువ్వు సువార్త కొరకు రు.100/- ఇస్తున్నట్లయితే దాన్ని రు.200కి పెంచు. ఒకవేళ రూ.10,000/- సేకరిస్తున్నట్లయితే 20,000/- సేకరించు. పేతురు కుంటి వానితో ఇలాగన్నారు. వెండి, బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసునొద్దకు నడిపించుట ప్రధానమైంది. కనుక యేసు నామాన్ని ప్రజల యొద్దకు లోతుగా తీసుకుని వెళ్ళు.

దేవున్ని ఎక్కువగా ప్రేమించి లోతైన ప్రార్ధనా జీవితాన్ని కలిగి, సహచరులతో మంచి సంబంధ బాంధవ్యాలతో, లోతుగా ప్రయాసపడుచూ, లోతుగా క్రొత్త ప్రాంతాలను దర్శించినట్లయితే తప్పక ఆత్మలను సంపాదించగలము. నీ ఆజ్ఞ చొప్పున అనేకమైన ఆత్మలను పట్టుటకు లోతుగా నడిపించు ప్రభువా - ఆమేన్‌!

 - రెవ.జెబ