వాక్యసందేశముPost Date:2014-12-26//No:108

క్రొత్త - ఆత్మీయ దీవెనలు(The New Spiritual Blessings)   గత సంవత్సరమంతా అనేక సమస్యలనుండి కాపాడుచు, విజయమిస్తూ సజీవులనుగా నూతన సంవత్సరములో మనలను ప్రవేశపెట్టిన జీవముగల దేవునికి వెలలేని స్తుతులు. 'మనము మంచి వారమని' ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు' (కీర్తన 103:14). మనలను జ్ఞాపకము చేసికొనుటకు మనమెంతటి వారము? ఆ అవసరము ఆయనకేమిటి? కారణం ఆయన ఉచితమైన కృపయే. మనము ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించినా, ఆయనను నిర్లక్ష్యము చేసినా, నీతిమంతుని మీదను అవినీతిమంతుని మీదను తన కృపావర్షమును కురిపింపజేసి, కునుకక మనలను కాపాడుచున్నాడు. వాస్తవానికి మనతో జీవించిన వారనేకులు ఈ దినమున లేరు. అయితే మనపట్ల ఏదో ప్రత్యేక ఉద్దేశ్యము కలిగి ఆయన మనలను సజీవులుగా వుంచి యున్నాడు. మనము తిని, త్రాగి, జీవించి ఈ లోకాన్ని అనుభవిస్తూ, సృష్టికర్తను విస్మరించడానికి కాదు. ఆయనను ఆయన కృపను ఎరిగి ప్రయోజకులుగా జీవించాలని ఆయన ప్రగాఢమైన కోరిక.

మనము 1. పురుగువంటివారము (యోబు 25:6), 2. ఓటికుండ వంటి వారము (కీర్త 31:12), 3. చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వారము (కీర్త 39:11), 4. కరగిపోయిన నత్తవలె వున్నాము (కీర్త 58:8), 5. కరిగిన మైనము వంటి వారము (కీర్త 68:2), 6. కాల్చబడిన ముళ్ళు వంటి వారము (యెష 33:12), 7. దోమ వంటివారము (యెష 51:6). అటువంటి నిరుపయోగులమైన మనలను ప్రభువు జ్ఞాపకము చేసికొనుచున్నాడు.

'ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను... ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి' (ప్రక 21:5). 'సమస్తము' మానవునిలో నున్న సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ నూతన సంవత్సరములో మన పాతబ్రతుకును నూతన పరచుట ద్వారా, నూతనంగా జీవించి ఆయనను నూతనముగా మహిమ పరచాలని ఆయన ప్రగాఢ వాంఛ. ఈ 2009 సంవత్సరములో ఆయన మన కిచ్చు మరికొన్ని ఆత్మీయ దీవెనలు.

1. కొత్తజన్మ (To Born again) : 'ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు' (యెహా 3:3). క్రొత్త జన్మ అనగా, పాప స్వభావమును, అనగా ఆదాము నుండి వచ్చిన తిరుగుబాటు బుద్ధిని వదులుకొని, క్రొత్తగా పుట్టిన శిశువును పోలి నూతనంగా ఎదుగు నిమిత్తము క్రీస్తులోనికి ప్రవేశించుట అని అర్ధము. 'ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను' (3 కొరిం 5:17). ధర్మశాస్త్రోపదేశకుడు నికొదేము, కేవలం ధర్మశాస్త్రము యొక్క ముసుగులోనే వున్నాడు గాని, అతని దేవుని రాజ్యములో ప్రవేశించే నిరీక్షణ లేకనే వున్నాడు. ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవ్వడును నీతిమంతుడు కాలేడు. మరి నీతిమంతుడు కాకుండ దేవుని రాజ్యము చూడలేడు. నీతిమంతుడైన క్రీస్తు ఒక్క్కడే నీతిమంతులుగా తీర్చగలవాడు. క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి నీతిమంతులుగా తీర్చబడుటే నూతన జన్మ. నూతన జన్మ పొందుటతో, మన చూపులు, మాటలు, నడవడిక, సమస్త లోకస్థులకు ప్రత్యేకముగాను, ఆశ్చర్యము గొలిపేవిగాను ఉంటాయి.

2. క్రొత్త నిబంధన (A New Covenant) : 'ఇదిగో... నేను క్రొత్త నిబంధన చేయుదును...' (హెబ్రీ 8:8). దేవుడు ఆదాముతో ఏదెనులో చేసిన నిబంధనలో వారు లోకములోని సమస్తమును ఏలుదురు గాకని చెప్పి వారిని ఏలికలుగా చేసియున్నాడు. దానికి ప్రతిగా వారు పాపము చేసి ఆ ఆశీర్వాదమును పోగొట్టుకున్నారు. ఆ తర్వాత సర్వసృష్టికర్తయైన దేవుడు తన ప్రజలతో 7 విధములైన నిబంధనలు చేసియున్నాడు. 1. నోవహుతో నిబంధన (ఆది 6:18), 2. అబ్రహాముతో నిబంధన (ఆది 15:18, 17:1-21), 3. మోషేతో నిబంధన (నిర్గమ 24:78), 4. పాలస్తీనా నిబంధన (లేవీ 26:9-12), 5. దావీదుతో నిబంధన (2 సమూ 7:13, 1 దిన 17:13,14), 6. నిత్య నిబంధన (నిర్గ 31:16), 7. క్రొత్త నిబంధన (యిర్మి 31:31, హెబ్రీ 8:8). నిబంధన అంటే ఒడంబడిక. ఈ క్రొత్త నిబంధనలో 7 భాగములున్నాయి. 1. వారి మనస్సులో నా ధర్మ విధులనుంచెదను. 2. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. 3. నేను వారికి దేవుడనై యుందును. 4. వారు నాకు ప్రజలైయుందురు. 5. వారిలో అందరు నన్ను తెలిసికొందురు. 6. నేను వారి దోషముల విషయమై దయ గలిగి, 7. వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొనను. ప్రియులారా, మీరు ఈ నూతన నిబంధనలోనికి వచ్చారా? లేనట్లయితే నేడే ఆయన ధర్మ విధులను గైకొని ఈ నూతన ఆశీర్వాదము పొందండి. ఇశ్రాయేలీయులకును దేవునికిని మధ్యవర్తి ధర్మశాస్త్రము. క్రైస్తవులకును దేవునికిని మధ్యువర్తి ప్రభువైన క్రీస్తు. ఆయనే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన రక్తప్రోక్షణ క్రిందికి మనము రావలసి వుంది.


క్రొత్త
3. క్రొత్తపేరు (A New Name) : 'జయించువానికి... తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును. పొందిన వానికి గాని అది మరయెవనికిని తెలియదు' (ప్రక 2:17). 'నా దేవుని మందిరములో ఒక స్తంభముగా చేసెదను. నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాసెదను (ప్రక 3:12). మనము ఈ లోకములో ఏ పేరు పెట్టుకున్నా, ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తరువాత ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది. అది ఆయన రాజ్యములో ప్రవేశించిననాడే తెలుసుకోగలము. అది, 'కొడుకులు, కూతుళ్ళు అని యనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు' (యెష 56:5), మరియు 'యెహోవా విమోచించిన వారనియు, ఆశింపదగిన దానవనియు... నీకు పేరు కలుగును' (యెష 62:12), ప్రియుడా, నీకు ప్రస్తుతము కలిగిన పేరును బట్టి దేవుని రాజ్యములో ప్రవేశింపలేవు. పేరులు ఈ లోకము మట్టుకే పరిమితము. దేవుడిచ్చే క్రొత్త పేరు పొందడానికి క్రీస్తు నంగీకరించి నూతన జీవము పొందాలి. పరలోకములో ఆయన నీ క్రొత్త పేరుతో పిలువనున్నాడు. ఇక్కడ సంపాదించుకున్న పేరు ఆ పేరుకు సాటికాదు.

4. క్రొత్తపాట (A New Song) : 'వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు' (ప్రక 5:9,10). భక్తుడైన యోహాను దర్శనములో చూచిన ఈ క్రొత్తపాట పాడువారు, క్రీస్తు రక్తమిచ్చి ప్రతివంశము లోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను దేవుని కొరకు కొనబడినవారు, వారు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేయబడినవారు. వారు వారి పాత పాట, అనగా పాత జీవితమును విడిచి రూపాంతరము పొందినవారు. క్రొత్తపాట, అనగా క్రొత్త సాక్ష్యమును కలిగినవారు. ప్రియుడా, సహోదరీ, నీ పాత బ్రదుకును వదలి నూతన జీవితమును ఈ నూతన సంవత్సరములో ప్రారంభించు, అప్పుడు దావీదు భక్తునితో పాటు 'తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మనదేవుడు నా నోటినుంచెను' (కీర్త 40:3) అని చెప్పగలవు. కాబట్టి యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి దేవునికి స్తోత్రగీతము పాడుము.

5. క్రొత్త స్వభావము (A New Attitude) : 'కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన... మీ ప్రాచీన స్వభావమును వదలుకొని, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడినవారై... దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను' (ఎఫె 4:23,24). మునుపు మనము తిరుగుబాటు స్వభావమును, అంధకార స్వభావమును, హృదయ కాఠిన్యము వలన అజ్ఞానములో వున్న పాపులమే. అయితే పురుషుడైన క్రీస్తును ధరించుకొనుట ద్వారా ఆయన మన స్వభావమును మార్చగలడు. నూతన సంవత్సరములో నూతన స్వభావముతో ప్రవేశించుదము. ఆ క్రొత్త స్వభావము నూతనోత్తేజాన్ని కలుగజేయగలదు.

6. క్రొత్తబోధ (A New doctrime) : 'అందరును విస్మయమొంది - ఇదేమిటో? యిది క్రొత్త బోధగా నున్నదే... అపవిత్రాత్మలు ఆయనకు లోబడుచున్నవి...' (మార్కు 1:27). క్రీస్తు వారి బోధ లోకస్తులకు క్రొత్తగానే వుంటుంది. ప్రభువు బోధ దయ్యముల బోధ కాదు. పరలోక రాజ్యపుబోధ, అధికారముతో కూడిన బోధ, అపవిత్రాత్మలను పారద్రోలిన బోధ. ఉపమానములతో కూడిన బోధ. పాపిని రక్షించే బోధ. ఆయన బోధింపనారంభించగా బహుజనులాయన యొద్దకు కూడి వచ్చేవారు. ఈ లోకములో అనేకమైన తప్పుడు బోధలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం బైబిలు బోధే కదా అని మోసపోకూడదు. అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చే రోజుల్లో మనమున్నాము. 'లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను' (కొరింథీ 15:3). ఇది సరియైన సువార్త. దైవభక్తికి అనుగుణమైన బోధన కాక భిన్నమైన బోధ నుపదేశించువాడు గర్వాంధుడవుతాడు. వినువాడు మోసపోతాడు. కాబట్టి అపోస్తులు బోధ యందు సహవాసమందును వుందుము గాక.

7. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి (A New Heaven and a New Earth) : 'ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను' (యెష 65:17). పాతభూమి ఆదాము తిరుగుబాటు వలన శపించబడింది. పాత ఆకాశములో లూసిఫర్‌ తిరుగుబాటు చేసాడు. కాబట్టి దేవుడు రెండింటిని కొట్టి వేసి క్రొత్త వాటిని సృజించనైయున్నాడు. 'సృజించబోవు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచియుండును (యెష 66:22). ఆ రెండింటిని యోహాను దర్శనములో చూసాడు. ప్రభువు వెయ్యేళ్ళ పాలన తరువాత అపవాదిని లయ పరిచి, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించనైయున్నాడు. ఇవి యుగయుగములుగా నిలిచినవి. వెయ్యేళ్ళ పాలనలో పాలి భాగస్తులే అందులో ప్రవేశించుటకు అర్హులు. ప్రియుడా! ఇప్పుడు మనము చూస్తున్న సృష్టి ఎంతో మహావేండ్రముతో లయము కావలసినది అది ఎప్పుడో మనకు తెలియదు. ఇది శాశ్వతము కాదు. నిలువరమైన కొత్త భూమ్యాకాశముల కొరకు ఎదురుచూస్తున్నాము. ఈ నూతన సంవత్సరములో వాటి కొరకు సిద్ధపడుచున్నావా? అందుకొరకు రక్షణ పొందుము. నేడే రక్షణ దినము. మరియొక దినము మనది కాదెమో! ప్రభువు కృప తోడైయుండును గాక.

- సహో||పి.బాబూరావు