వాక్యసందేశముPost Date:2014-12-22//No:106

నాలుగవ జ్ఞానినాలుగవ జ్ఞాని  ఈ కధను మొదటిసారిగా 1892 లో క్రిస్మస్‌ రోజున న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్‌ చర్చిలో చదివారు. హెన్రీ వాన్‌ డైక్‌ అనే అమెరికన్‌ సువార్తికుడు ఈ కధను వ్రాసారు. అప్పటినుండి ప్రపంచం నలుమూలల అనేక భాషలలోనికి ఈ కధ అనువాదమైనది. అనేక లక్షలమంది ఈ కధను చదివి కొన్ని విధాలైన జయముల కంటే అపజయమే మేలు అయినది అనే ఈ కధలోని సారాంశమును గ్రహించారు. హెన్రీ వాన్‌ డైక్‌ గారి మాటలలోనే ఈ కధను మనము తెలుసుకొందాం.

మీకు తూర్పు దేశపు జ్ఞానుల కధ తెలుసు. వారు చాలా దూరము నుండి ప్రయాణం చేసి బెత్లెహేము చేరారు. అయితే మరొక జ్ఞాని ఆ నక్షత్రమును చూసి దానిని వెంబడించుటకు ప్రయత్నించాడు. కాని సమయమునకు చేరలేకపోయాడు. అతని గొప్ప ఆశ ఏ విధముగా నెరవేరలేదో తన ఆశయాన్ని అతడు ఎలా సాధించాడో 'హృదయము' అనే భవనములో 'స్వప్న మందిరము'లో నేను చూసిన దానిని మీకు తెలియజేస్తున్నాను.

కైసరు ఔగుస్తు రోమా చక్రవర్తిగా ఉన్నప్పుడు యెరుషలేమును హేరోదు పరిపాలించేవాడు. అప్పుడు పర్షియా దేశములో ఎక్బటానా అనే నగరంలో అర్టుబాన్‌ అనే జ్ఞాని ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితులైన తొమ్మిది మంది జ్ఞానులను తన ఇంటికి ఆహ్వానించాడు. వారందరితో అర్టుబాన్‌ 'నేను ఒక నక్షత్రమును కనుగొన్నాను. ఆ నక్షత్రమును చూసినప్పుడు ఒక గొప్ప చక్రవర్తి భూమిమీద జన్మిస్తాడు అని గ్రహించాను. నేను వెళ్ళి ఆయనను పూజించాలని అనుకొంటున్నాను. మీరు కూడా వస్తారేమోనని మీకందరికి వర్తమానం పంపాను' అన్నాడు. అతని మిత్రుడైన టైగ్రేన్‌ 'అర్టుబాన్‌! నీవు ఇంత జ్ఞానివైనా ఇన్ని శాస్త్రములను అభ్యసించినా ఒక నక్షత్రమును చూచి చక్రవర్తి జన్మిస్తాడని చెప్పటం అంత నమ్మశక్యం కావటంలేదు' అన్నాడు.

అప్పుడు అర్టుబాన్‌ రెండు గ్రంధపు చుట్టలను బయటకు తీసాడు. 'మన పూర్వికులు బాబిలోన్‌కు రాకముందు కల్దియా దేశపు జ్ఞానులు ఈ నక్షత్ర శాస్త్రమును అభ్యసించారు వారిలో బిలాము అనే జ్ఞాని ఉన్నాడు. ఆయన 'యాకోబులో నక్షత్రము ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో ఉదయించును' అని వ్రాసాడు. అర్టుబాను చదువుతూ ఉండగానే టైగ్రేన్‌ అడ్డుకున్నాడు. 'అర్టుబాన్‌! యూదా అప్పుడు బాబిలోన్‌కు బానిసగా ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలీయులు మన రాజులకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రములన్నీ తప్పిపోయిన గొర్రెలవలె ప్రపంచమంతటా చెదరిపోయారు. ప్రస్తుతం రోమా సామ్రాజ్యపు అధికారం క్రింద ఉన్న యూదయలో ఏ నక్షత్రం ఉదయించదు. ఏ రాజదండము ఉద్భవించదు.' అన్నాడు.

అందుకు అర్టుబాను 'ఇది దానియేలు అని వ్రాసిన విషయం. ఆయన బెల్తషాజర్‌ అనే రాజుకు కొన్ని కలల భావాన్ని చెప్పారు. ఆయన ఏమి అన్నారంటే 70 వారములలో యెరుషలేములో మెస్సియా ఉద్భవిస్తారు. 62 వారములలో దానిని మరల కట్టుతారు' అన్నాడు. ఆగ్భారస్‌ అనే జ్ఞాని 'ఇవన్నీ మర్మమైన సంఖ్యలు. వీటి అర్ధమును ఎవరు చెప్పగలరు.'? అన్నాడు. అర్టుబాను చిరునవ్వుతో ఇలా అన్నాడు.

'నా స్నేహితులైన ముగ్గురు జ్ఞానులు కాస్పర్‌, మెల్‌కాయర్‌, బెల్‌తజర్‌ పురాతన గ్రంధాలను కల్దియా దేశపు శాసనాలను పరిశీలించి ఈ సంవత్సరమే చక్రవర్తి ఉదయిస్తాడని కనుగొన్నారు. నేను ఆకాశమును పరిశీలిస్తూ ఉండగా ఒక గొప్ప నక్షత్రమును కనుగొన్నాను. వారు బాబిలోనియాలో నాకోసం ఎదురు చూస్తున్నారు. పదిరోజులలో నేను వారిని కలుసుకుని యెరూషలేముకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వ్యక్తిని పూజించి వస్తాను. నా ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాను.

నా ఇంటిని నాకున్న సమస్తమును అమ్మివేశాను. ఆ రాజుకు కానుకగా ఇచ్చుటకు ఒక పచ్చ, ఒక కెంపు, ఒక ముత్యం తీసుకున్నాను అని తన అరచేతిని చాపాడు. ఆ మూడు ఖరీదైన రాళ్ళను చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. వారి కళ్ళు పెద్దవైనాయి. టైగ్రీన్‌ 'ఆర్టుబన్‌, నీవు ఒక అనవసరమైన విషయం గురించి పాటు పడుతున్నావేమో? పతనమైపోయిన ఇశ్రాయేలు జాతిలో ఏ రాజూ జన్మించడు. వారికి వెలుగు ఉదయించనే ఉదయించదు' అన్నాడు. వారు ఒక్కొక్కరే బయటికి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిన తరువాత అగ్భారస్‌ 'అర్టుబన్‌, నీవు చెప్పినది నిజమే అనిపిస్తున్నది. అసాధ్యమైన యాత్రను నీవు ప్రారంభించావు. నేను చాలా వృద్ధుడను. ఇంత పెద్ద యాత్రను నేను చేయలేను. నీవు క్షేమంగా వెళ్ళిరా' అన్నాడు.

వారందరూ వెళ్ళిన తరువాత అర్టుబన్‌ బయటికి వచ్చి ఆకాశంవైపు చూశాడు. అర్టుబన్‌ చూస్తూ ఉండగానే ఒక అందమైన నక్షత్రము ఆకాశంలో కన్పించింది. దాని చుట్టూ కాంతి వృత్తం స్పష్టంగా కనబడుతోంది. దానిని చూడగానే అర్టుబన్‌ తలవంచి 'ఇదే ఆ నక్షత్రం. ఆ రాజు వస్తున్నారు. నేను వెళ్ళి ఆయనను కలుసుకొంటాను' అన్నాడు. అతడు ఆ నక్షత్రానికి తలవంచి నమస్కారము చేశాడు.

అర్టుబన్‌ తన గుర్రం ఎక్కి ప్రయాణం సాగించాడు. రాత్రంతా ఎక్కడా ఆగలేదు. తన స్నేహితులంతా ఓర్నోట్స్‌ పర్వత ప్రాంతాలలో ఉంటామని చెప్పారు. వారందరితో కలసి చాలా తేలికగా ప్రయాణం సాగించవచ్చును. అర్టుబన్‌ ఒక క్రోసెడు దూరం వెళితే తాను చేరవలసిన ప్రాంతం చేరతాడు. అతని గుర్రం ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నది. మరికొంచెంసేపు ప్రయాణం చేస్తే అతడు తన మిత్రులను కలుసుకుంటాడు. అంతలో గుర్రం నెమ్మదిగా పరుగెత్తడం ప్రారంభించింది.

అతడు చీకటిలో చూసే సరికి ఒక వ్యక్తి నేల మీద పడి ఉన్నాడు. అర్టుబన్‌ గుర్రం దిగాడు. ఆ చీకటివేళ రోడ్డుకు అడ్డంగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతనికి సహాయం చేసే ఉద్దేశ్యం పెట్టుకోలేదు. ఎందుకంటే ఇతనికి పరిచర్య చేస్తూ ఉంటే అతని మిత్రులను కలుసుకొనుట సాధ్యం కాదు. మరికొంతసేపటిలో మరణించే ఆ వ్యక్తిని విడచి వెళ్లిపోదామని అర్టుబన్‌ వెనక్కి తిరిగాడు.

ఆ వ్యక్తి అర్టుబన్‌ వచ్చిన విషయాన్ని గ్రహించి మెల్లగా లేచి అర్టుబన్‌ అంగీని పట్టుకున్నాడు. అప్పుడు అర్టుబన్‌ సంశయములో పడ్డాడు. తాను ఇతనికి సేవచేసి బ్రతికించాలా? లేక
నాలుగవ
అతడు ఆ వీధులలో నడచి వెళ్ళుతుండగా ఒక స్త్రీ పాడుతున్న జోలపాట వినబడింది. అతడు వెళ్ళి తలుపుకొట్టాడు. ఒక స్త్రీ వచ్చి తలుపు తీసింది. 'కొద్ది రోజుల క్రితం నీవు ధరించుకొన్న దుస్తులు వంటివి ధరించుకొన్న ముగ్గురు వ్యక్తులు ఈ ఊరిలో కనిపించారు. వారు తూర్పు దేశంలో కొత్తగా పుట్టిన నక్షత్రమును చూచి రాజుగా ఒక వ్యక్తి జన్మించాడని ఆయనను దర్శించడానికి వచ్చామని చెప్పారు. వారు నజరేతు అనే ఊరికి చెందిన జోసఫ్‌ అనే వడ్రంగి భార్య అయిన మేరీని, వారికి జన్మించిన శిశువును చూచి బంగారం, సాంబ్రాణి, బోళము సమర్పించారు. కాని ఆ వచ్చిన యాత్రికులు రాత్రికి రాత్రే మాయమైపోయారు. వారు ఎందుకు వచ్చారో ఎలా మాయమైపోయారో మాకు అర్ధం కాలేదు. నజరేతు నుండి వచ్చిన ఆ కుటుంబం వారు కూడా మాయమైపోయారు' అని చెప్పింది. ఆమె చేతిలోని శిశువు అర్టుబాన్‌ ముఖం వైపు చూసి నవ్వింది. ఆమెను చూడగానే అర్టుబాన్‌ మనసులో చాలా సంతోషించాడు. వాగ్దానం చేయబడిన రాజు ఈ శిశువు కాకూడదా? అనుకొంటూ ఒక్కొక్కసారి మహారాజులు సామాన్యమైన ఇళ్ళల్లో జన్మించారు. నా ప్రయాణాన్ని ఇంత త్వరగా దేవుడు సఫలం చేయడం లేదు కదా! అని మనసులో అనుకొన్నాడు.

అర్టుబాన్‌ బయలుదేరుటకు లేచాడు. అంతలో వీధిలో పెద్ద అలికిడి అయ్యింది. ఆడవాళ్ల కేకలు వినిపించాయి. ఏమి జరిగిందో తెలుసుకోవాలని అర్టుబాన్‌ గుమ్మం దగ్గరకు వచ్చాడు. కొందరు సైనికులు రక్తం ఓడుతున్న కత్తులతో అతనికి కనబడ్డారు. 'హేరోదు సైనికులు మన పిల్లలను చంపుటకు వచ్చారు' అనే కేకలు వినపడ్డాయి. ఏమి జరిగిందో తెలుసుకొనేలోగా ఒక సైనికుడు అతను నిలబడి ఉన్న గుమ్మం వద్దకు వచ్చి అతనిని చూచి ఆగాడు. ఆ సైనికుడు 'ఎవరైనా రెండు సంవత్సరములలోపు మగశిశువులు ఉన్నారా? అని అడిగాడు. అర్టుబాన్‌ వెనక్కి తిరిగి చూచాడు. ఆ స్త్రీ తన బిడ్డను కౌగిలిలోనికి తీసుకొని హృదయానికి హత్తుకొన్నది. ఒక సెకను జాప్యం చేస్తే సైనికుడు ఆ బిడ్డను చంపివేస్తాడు. అర్టుబాన్‌ ఒక సెకనులోనే నిర్ణయం తీసుకున్నాడు. తన అంగారఖా జేబులో నుండి ఒక కెంపు బయటకు తీసాడు. ఆ సైనికుని చేతిలో పెట్టి 'ఇక్కడ ఎవరూ లేరు. నన్ను ప్రశాంతంగా ఉండనియ్యి' అన్నాడు. ఆ కెంపును చూడగానే సైనికాధికారి ఏమీ మాట్లాడకుండా ఆ కెంపును తీసుకొని వెళ్ళిపోయాడు. అర్టుబాన్‌కి చాలా దుఃఖం కలిగింది. 'దేవునికోసం నేను తెచ్చిన కానుకను మనుష్యులకు ఇచ్చాను. దేవుడు నన్ను క్షమించుగాక' అనుకొన్నాడు. ఆ స్త్రీ ఏడుస్తూ అర్టుబాన్‌ను దీవించింది.

'యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక'.

నా 'స్వప్న మందిరం'లో చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్నది. అర్టుబాన్‌ జీవిత సంవత్సరములు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. అతడు ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు వెళ్తూ వడ్రంగి అయిన జోసఫ్‌ గురించి అతని భార్య అయిన మేరీ గురించి వెదకుతున్నాడు. వడ్రంగి అయిన జోసఫ్‌ ఈజిప్ట్‌కు వెళ్ళాడని విని అర్టుబాన్‌ కూడ ఈజిప్ట్‌కు ప్రయాణమై వెళ్ళాడు. ప్రతి ఇంట్లో బెత్లెహేము నుంచి వచ్చిన యూదుడైన వడ్రంగి ఉన్నాడా? అంటూ దాదాపుగా 30 సంవత్సరములు అన్వేషించాడు. అప్పుడప్పుడు యూదా మత ప్రవక్తలను కలుసుకొని వారితో చర్చలు జరిపేవాడు. వారు చెప్పిన ఆధారములను అనుసరించి మెస్సియా రాజనగరంలో జన్మించడని పేదవారి మధ్య దుఃఖా క్రాంతుల మధ్య ఉంటాడని కనుగొన్నాడు. అందువల్ల అర్టుబాన్‌ పేదలు అధికంగా ఉండే ప్రదేశాలలో మెస్సియా గురించి అన్వేషించటం ప్రారంభించాడు.

బహుశా ఈ పేదవారిలోనే బెత్లెహేము నుండి పారిపోయి వచ్చిన కుటుంబం ఆశ్రయం పొందిందని అర్టుబాన్‌ అనుకొన్నాడు. అక్కడ కనిపించే అనేక రోగులకు తనకు తెలిసిన వైద్యశాస్త్రం నుండి వనమూలికలను ఇస్తూ వారి కష్టాలలో ఆదుకుంటూ తన అన్వేషణను కొనసాగించాడు. ఒకవేళ చెరసాలలో ఉన్నాడేమో అనుకొని అర్టుబాన్‌ చెఱశాలకు వెళ్లి అక్కడ కూడా విచారించాడు. అప్పుడప్పుడు తన హృదయానికి దగ్గరగా ఉన్న ఆ ముత్యాన్ని తీసి దీనిని ఆ మెస్సియాకి నేను అందజేయగలనా? అని తలపోస్తూ ఉండేవాడు. ఈ విధంగా 33 సంవత్సరములు గడిచిపోయాయి. నల్లగా ఉండే అతడి జుట్టు తెల్లగా పండిపోయింది. కళ్ల క్రింద నల్లని చారలు వచ్చాయి. ముఖము ముడతలు పడిపోయింది.

ఒక వ్యక్తి 'బేత్సయిదాలో ఒక వడ్రంగి కుమారుడు ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని చాలామందికి అంటే దాదాపుగా పదివేల మందికి తృప్తిగా ఆహారాన్ని పంచిపెట్టాడు అని ఆశ్చర్యముగా చెప్పుచుండగా అర్టుబాన్‌ విన్నాడు. అర్టుబాన్‌ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఇటువంటి అద్భుత కార్యములు మానవులు చేయలేరు. అతడు తప్పక మెస్సియా అయి ఉంటాడు. పైగా అతడు వడ్రంగి కుమారుడట. అతడు ఎంతో ఆనందంగా బేత్సయిదాకు ప్రయాణమై వెళ్ళాడు. అది పస్కా పండుగ సమయం. ప్రపంచం నలుమూలల నుండి అనేకమంది యాత్రికులు యెరుషలేముకు చేరుకొంటున్నారు.

వారితో కలిసి అర్టుబాన్‌ కూడా యెరుషలేముకి చేరుకున్నాడు. అతడు వెళ్ళేసరికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అతడు ఎందుకు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నవి అని విచారించగా 'ఈ రోజు ఇద్దరు బందిపోటు దొంగలను గొల్గతా కొండపై సిలువ వేస్తున్నారు. వారితో పాటు నజరేతువాడైన యేసు అనే వ్యక్తిని కూడ సిలువ వేస్తున్నారు. ఆయన అనేక అద్భుత కార్యాలు చేసాడు. కాని యూదా మత పెద్దలు, యాజకులు తాను దేవుని కుమారుడనని చెప్పుకోవటం వల్ల అతనికి మరణశిక్ష విధించాలని పట్టుబట్టారు. పిలాతు కూడా యూదుల రాజు అని అతను చెప్పుకొన్నందువల్ల అతనికి మరణ శిక్ష విధించాడు' అని చెప్పాడు.

ఆ మాట వినగానే అర్టుబాన్‌ హృదయం తల్లడిల్లి పోయింది. ఆయన కోసమే నేను 33 సంవత్సరాలు నిరీక్షించాను, అన్వేషించాను నా ఊహలకంటే దేవుని తలంపులు అద్భుతమైనవి. తన శత్రువుల చేతిలో నా రాజు ఉన్నపుడు ఆయన మరణించకుండా నా వద్ద ఉన్న ఈ ముత్యమును ఆ శత్రువుల కిచ్చి ఆయనను విడిపిస్తాను. అనుకొంటూ అతడు దమస్కు గుమ్మం గుండా గబగబా లోపలికి నడిచాడు. అకస్మాత్తుగా ఒక 12 సంవత్సరముల బాలిక అర్టుబాన్‌ను చూచి అతడు వేసుకున్న దుస్తులను బట్టి అతడు పర్షియా దేశమునకు చెందినవాడని గుర్తించి వచ్చి ఆయన మోకాళ్ళను పట్టుకుంది.

ఆమె 'నాపై కరుణ చూపించు. మా తండ్రి చేసిన అప్పుల నిమిత్తం నన్ను బానిసగా తీసుకొని వెళ్తున్నారు. నన్ను రక్షించు' అన్నది.

అర్టుబాన్‌ వణికిపోయాడు. మానవసేవయే దైవసేవ అని అనుకునే తాను ఈ సమయంలో ఏమి చేయాలి? విలువైన ముత్యమును ఈ బాలికను విడిపించుటకు ఇవ్వాలా లేక ప్రభువును విడిపించుటకు ఇవ్వాలా? బబులోను నుండి ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేసి తాను అన్వేషించిన వ్యక్తిని కలుసుకోవాలా లేక నిస్సహాయురాలైన ఈ బాలికను రక్షించాలా? అతడు తన అంగరఖా జేబులో నుండి ముత్యాన్ని బయటికి తీసాడు. అది ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా అతనికి తోచింది. ఆ ముత్యమును ఆ అమ్మాయి చేతిలో పెట్టి నేను రాజుకోసం దాచిన చివరి ముత్యం. దీన్ని తీసుకో అని అమెకు ఇచ్చాడు. ఆమె ఆ ముత్యాన్ని తనను తీసుకొని వెళ్తున్న సైనికులకు ఇవ్వగానే వారు ఆమెను విడిచి వెళ్లిపోయారు.

అంతలో ఆకాశం అంతా దట్టంగా చీకటి కమ్ముకుంది. భూకంపం వచ్చింది. అకస్మాత్తుగా వర్షం కురిసే సూచనలు కనబడ్డాయి. అర్టుబాన్‌ తడబడే అడుగులతో ఒక ఇంటి చూరు క్రిందకు వచ్చాడు. భూమి కంపించింది. అర్టుబాన్‌ నిలబడి ఉన్న ఇంటి పైన ఉన్న పెంకులు జారి అర్టుబాన్‌ తలపై పడ్డాయి. అతడు తల పట్టుకొని కూలబడ్డాడు. ఆ 12 సంవత్సరముల బాలిక అతనికి తగిలిన దెబ్బకు భయపడి అతని తలనుండి రక్తం కారకుండా చేతితో అదిమిపట్టింది.

అప్పుడు అర్టుబాన్‌ పెదవులు కదిలాయి. 'నీవు ఆకలిగా ఉండగా ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చాను? నీవు దాహంగా ఉండగా ఎప్పుడు నీరు ఇచ్చాను? నీవు రోగిగా, చెరశాలలో ఉన్నప్పుడు ఎప్పుడు పరామర్శించాను? 33 సంవత్సరములుగా నీ కొరకు నేను వెతికాను. నీ ముఖం ఎప్పుడు చూడలేదు. నీకు ఏ పరిచర్య చేయలేదు. అది నాకు ఎంతో దుఃఖంగా ఉంది' అన్నాడు అర్టుబాన్‌. అతడు ఆ మాట వినగానే ఆ బాలికకు ఎవరో దూరమునుండి మాట్లాడుచున్నట్లుగా కొన్ని మాటలు వినబడ్డాయి.

'మిగుల అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మేలు చేసితిరి. కనుక నాకును చేసితిరి'అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ఆ మాట వినగానే అర్టుబాన్‌ ముఖం సంతోషంతో, ఆశ్చర్యంతో వెలిగిపోయింది. అతడు ఒక దీర్ఘశ్వాసను విడిచాడు. అతని ప్రయాణం పూర్తి అయింది. అతని బహుమతులు దేవునికి చేరాయి. అర్టుబాన్‌ ప్రభువును శారీరకంగా చూడలేదు కాని ఆధ్యాత్మికంగా దర్శించాడు.

 - డా||పి.బి.మనోహర్‌