మిషనరీ చరిత్రPost Date:2013-09-21//No:3

సెబాస్టియన (1554 - 1578)

సెబాస్టియన

సెబాస్టియన్ గాల్ లో పుట్టెను. రాచరికపు అధికారిగా రోమ్ నగరంలో స్థిరపడెను. ఉదారతలో అందరిచే కొనియాడబడెను. విగ్రహారాధనను తిరస్కరించి క్రీస్తు భక్తునిగా జీవితాన్ని సాగించుచుండెను. ఒక రోమన్ అధికారి ద్రోహదం వల్ల ఇతడు క్రైస్తవుడని చక్రవర్తికి తెలిసెను. వెంటనే చక్రవర్తి అతనిని రప్పించి, నీవు క్రీస్తుకు ప్రార్దిస్తున్నావా? అని అడుగగా, సెబాస్టియన్ 'నా క్రీస్తు భక్తి రోమన్ సామ్రాజ్య సంరక్షణకు ఏ విధమైన ఆటంకము కాదు. చక్రవర్తి ఔన్నత్యం కోసం, సుఖ సంపదల కోసం నిజమైన దేవుడ్ని ప్రార్ధించడం నా ధర్మం' అని సమాధానమిచ్చెను.

               ఉగ్రుడైన డయోక్లీషియస్ అనే ఆ చక్రవర్తి నగరు సరిహద్దులలో నున్న బహిరంగ ప్రదేశంలో సెబాస్టియన్ ను బాణాలచే కొట్టి చంపమని ఆజ్ఞాపించెను. చక్రవర్తి ఆజ్ఞ అమలు జరుపబడెను. కొంతమంది క్రైస్తవ మిత్రులు ఆ ప్రదేశమునకు వెళ్లి మృత కళేబరాన్ని సమాధి చేయ తలపెట్టగా, ఆయనలో ఊపిరి ఉన్నట్లు స్పష్టమైనది. వెంటనే అతనిని సురక్షిత ప్రదేశానికి చేర్చి, చికిత్స చేయగా; కొద్ది కాలములోనే స్వస్థత చేకూరెను.

               అయితే ఒకనాడు అతడు చక్రవర్తి దృష్టిలో పడెను. సెబాస్టియన్ ను చూచి చక్రవర్తి నిర్ఘాంతపోయెను. చచ్చినవాడు ఎలా బ్రతికి వచ్చాడా! అని ఆశ్చర్యపడ్డ చక్రవర్తి, మరింత కర్కశుడై సెబాస్టియన్ ను రాజభవనం ఎదుట కొట్టి చంపమని ఆజ్ఞాపించెను. అంతే సెబాస్టియన్ ను బంధించి, చావగొట్టి, మరల లేవకుండా ఓ పెద్ద గోతిలో పడవేశారు. క్రీస్తు కొరకు మరొకసారి చావుదెబ్బలు తినటం మరింత శ్లాఘ్యముగా ఎంచిన సెబాస్టియన్ హత సాక్షిగా మరణించెను.