సంఘానికిPost Date:2013-09-19//No:9

దీనులు, నిరుపేదలే దేవుని గుండెచప్పుడుఇంగ్లండ్‌లోని ఒక చర్చ్‌లో కానుకల పండుగలో భక్తులంతా పెద్దమొత్తాల్లో కానుకలిచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక పేదావిడ తన రెండు పౌండ్ల కానుక ఇవ్వాలా, వద్దా అని సంకోచిస్తుండగా, అది చర్చి పాస్టర్ గమనించి, ‘కానుక గొప్పదనాన్ని నిర్ణయించేది దేవుడే. మీ కానుకలతో కొన్ని సువార్త కరపత్రాలు కొని ఆఫ్రికాలోని ఒక చర్చికి మీ తరఫున పంపుతాను’అని చెప్పి, వాటిని స్వీకరించాడు. కొన్నేళ్లకు ఆఫ్రికాకు చెందిన ఒక గొప్ప ప్రబోధకుడు వచ్చి ఆ చర్చిలో ప్రసంగిస్తూ, ‘ఈ చర్చికి చెందిన ఒక అజ్ఞాత విశ్వాసి పంపిన కరపత్రం చదివి పరమ దుర్మార్గుడైన నేను మారాను’ అన్నాడు. వెనక బెంచిలో కూర్చుని ఆ మాటలు విన్న ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు.

 కొరింథి చర్చికి రాసిన లేఖలో అపొస్తలుడైన పౌలు మాసిదోనియా చర్చి దాతృత్వాన్ని ప్రత్యేకంగా శ్లాఘించాడు ( 2 కొరింథి 8:1-5). అలెగ్జాండర్  మహాచక్రవర్తి స్వస్థలమైన మాసిదోనియా ప్రజల ఆస్తులు, భూములు, సంపదనంతా ఆ తరువాతి రోమాపాలకులు ఆక్రమించుకుని వారిని నిరుపేదలను చేశారు. పైగా అలెగ్జాండర్ మీది అక్కసుతో వారిని అష్టకష్టాలు పెట్టేవారు. అలా దుర్భర దారిద్య్రంలో, శ్రమల్లో పుట్టిన మాసిదోనియా చర్చికి, గొప్ప దాతృత్వ గుణమున్న హృదయాన్ని దేవుడిచ్చాడు. అందువల్ల యెరూషలేములోని విశ్వాసులు కరువుతో అలమటిస్తున్నారని తెలిసి మాసిదోనియా వారే వారికి అత్యధిక సాయం పంపి ‘ఇవ్వడం’అనే విశ్వాస నిరూపణలో అగ్రగామిగా నిలిచారు( 1 కొరింథి 16:3). అలెగ్జాండర్ చరిత్ర అర్ధాంతరంగా ముగిసింది కాని ఆయన వారసులైన మాసిదోనియా చర్చి ఔదార్యం ఇప్పటికీ మారుమోగుతోంది.

 విశ్వాసికి, చర్చికి కూడా దాతృత్వమే మూలం. అయితే దాతృత్వానికి పేదరికం, శ్రమలు అడ్డురావు. నిజానికి నిరుపేదలే గొప్ప దాతలని, ధనికుల్లో అధికులు పరమపిసినారులని అమెరికాలో ఒక సర్వేలో తెలిసింది. అక్కడ 2011లో పోగైన మొత్తం ఛారిటీ నిధుల్లో, నిరుపేదలు 15.5 శాతం ఇవ్వగా, సంపన్నులంతా కలిసి ఇచ్చింది 2.9 శాతం మాత్రమే. గొప్ప ప్రసంగాలతో కాదు, దాతృత్వం అనే చేతల్లో దేవుని ప్రేమను చాటేవాడే నిజమైన సువార్తికుడు. ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికివ్వాలి? అన్న ప్రశ్నను యేసుప్రభువుకే వేస్తే, ఆయన తప్పకుండా నిరుపేదలకివ్వమనే చెబుతాడు (మత్తయి 25:31-46).

ఎందుకంటే దీనులు, నిరుపేదలే దేవుని గుండెచప్పుడు. నిరుపేదను లేదా అత్యవసరతలో ఉన్న వ్యక్తిని లేదా కుటుంబాన్ని ఆదుకోవడానికి విశ్వాసి చేసే ఒక చిరుప్రయత్నం కూడా దేవుని హృదయాన్ని ఎంతో ఉప్పొంగ చేస్తుంది. కాని దేవుడుద్దేశించని వారికి మీ కానుకను చేరవేయడం, తద్వారా మీ కానుకకు అత్యధికమైన ప్రతిఫలం దేవుని నుండి రాకుండా చేయడం సాతాను కుట్ర! కానుకలివ్వమని మాసిదోనియా చర్చిని పౌలు అడగలేదు. తమ కానుకలు తీసుకుని పేదవిశ్వాసులనాదుకొమ్మని మాసిదోనియా చర్చి వారే పౌలును బతిమాలారు. అదీ నిజమైన పరిచర్య అంటే! ఈ రోజే మీరు ప్రార్థించి మీకున్న కొద్దిలోనే కొంత పేదలకో, అవసరతలో ఉన్న వారికో ఇచ్చి చూడండి. నిజమైన రక్షదానందమేమిటో, శాంతి ఏమిటో మీకు ప్రతిఫలంగా ఇచ్చే దేవుని దాతృత్వమెంత గొప్పదో అప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోండి.


దీనులు,