చర్చి చరిత్రPost Date:2013-09-23//No:4

కడప విశిష్ట ఆరాధన మందిరం సెయింట మేరీస కేథడ్రల చర్చి

కడప
 హాయ్ చిన్నారులూ బడి గంటలు మోగేందుకు మరికొన్ని రోజులే సమయముంది కదూ.. మరి ఈ గ్యాప్‌లో ఆ బడి గంటల గురించేగాక విశిష్టమైన గుడి గంటల గురించి, ప్రత్యేకమైన ఆరాధనమందిరం గురించి తెలుసుకుందామా? దీన్ని చూడటానికి వేరే జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన జిల్లా కేంద్రమైన కడప నగరం మరియాపురంలోగల ఈ మందిరాన్ని సెయింట్ మేరీస్ కేథడ్రల్ చర్చిగా వ్యవహరిస్తారు. మరి ఈ మందిరం విశిష్టతమిటో తెలుసుకుందామా..

కడప నగరం మరియాపురంలో మెయిన్‌రోడ్డుకు పక్కనే ఉంది సెయింట్ మేరీస్ కేథడ్రల్ చర్చి. మూడెకరాల విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ చర్చి రాయలసీమలోనే సుందరమైనదిగా, ఎన్నో ప్రత్యేకతలుగల చర్చిగా తక్కువ కాలంలోనే పేరు సంపాదించింది. 1988 ఫిబ్రవరి 11న నాటి కథోలిక డయాసిస్ అధిపతి, ఆధ్యాత్మిక వేత్త రెవరెండ్ బిషప్ అరులయ్య ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. 1992 ఫిబ్రవరి 19కి చర్చి నిర్మాణం పూర్తయింది. 

అప్పట్లోనే ఈ చర్చి నిర్మాణానికి ’ కోటికి పైగా ఖర్చయింది. చర్చిలో ప్రార్థనా పీఠం వద్ద ఇటలీ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మేరీ మాత స్వరూపాన్ని ప్రతిష్టించారు. చర్చిలోని విశాలమైన ప్రాంగణంలో ఒకేసారి రెండు వేల మంది ప్రార్థనలు చేసే అవకాశం ఉంది. ప్రధాన ద్వారం ఎదురుగా కరుణామయుడు ఏసుక్రీస్తు విగ్రహం, చర్చిపై గల ఆర్చిలో తల్లి మరియ విగ్రహం ఈ మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చర్చి నిర్మాణంలో ఎంతో విశిష్ఠత ఉంది. పై భాగంలో కమలం ఆకారంలో ఉన్న నిర్మాణం ప్రాచీన హిందూ నిర్మాణ శైలిని తలపిస్తుంది. 

బయట ముఖ ద్వారం, ఆ బయటగల ఆర్చిలు అర్ధ చంద్రాకారంలో ముస్లిం, హిందూ నిర్మాణశైలిని గుర్తు చేస్తాయి. ముఖ ద్వారానికి ఉపయోగించిన స్తంభాలలో బౌద్ధ, జైన, క్రైస్తవ నిర్మాణ శిల్పరీతులు కనిపిస్తాయి. మతసామరస్యానికి మారుపేరుగా నిలిచి ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక భావనలు కల్పించేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ చర్చి రాయలసీమలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతి మందిరంగా పేరుగాంచింది. చర్చిపైగల గంటకు కూడా ఒక ప్రత్యేక ఉంది. దాదాపు 400 కిలోల బరువుగల ఈ ఇత్తడి గంటను కూడా ప్రత్యేకంగా ఇటలీ నుంచి తీసుకొచ్చారు. రాయలసీమ నలుమూలలనుంచి ఎందరో విశ్వాసులు ఈ చర్చిని దర్శించుకుని గుర్తుగా ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు సందర్శకులు కూడా విశేష సంఖ్యలో ఈ చర్చికి వస్తుంటారు. మరి మనమూ ఓసారి చూసొద్దామా.