బైబిల్-చరిత్రPost Date:2014-11-14//No:16

అండమాన్‌ - నికోబార్‌ దీవులలో క్రైస్తవ్యపు తొలి అడుగులుకార్‌ నికోబార్‌ దీవులలో థాబ్దాల పూర్వం నాటబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్త తొలిబీజం మొలకెత్తి వేరుపారి వృక్షంగా ఎదిగి నేటికి దాని మూలాలు ఇతర ఆర్చిపెలాగో దీవులకు విస్తరించిన చారిత్రాత్మక నేపధ్యాన్ని "Sons of Light - the story of Car Nikobar" అను గ్రంధములో కీ.శే.బిషప్‌ యం.డి.శ్రీనివాసన్‌ తెలియజేసిన అనేక అంశాలు మనలో గొప్ప ప్రేరణను, నూతన ఉత్తేజాన్ని నింపడమేకాక పాపపు ఊబిలో చిక్కుకొని గాడాంధకారపు లోయలలో మగ్గుతున్న నేటి యావత్‌ మానవాళి విమోచనార్ధం ఆ సువార్త లోకానికి ప్రకటించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. నిద్రాణమైన నేటి క్రైస్తవ సంఘాన్ని తట్టిలేపుతుంది.

1789 సంవత్సరంలో బ్రిటీష్‌వారు దీవులను ఆక్రమించిన తొలి నాళ్ళలో కొంతమంది బ్రిటీష్‌ అధికారులతో పాటు బెంగాల్‌ నుండి తీసుకొని రాబడిన కొంతమంది ఖైదీలు/నేరస్తులు మాత్రమే ఇక్కడ (అండమాన్‌) లో కాపురముండేవారు. అన్ని కార్యక్రమాలలో పాస్టర్‌గారు ప్రధానపాత్ర పోషించేవారు. నేలపై వున్నపుడు గాని, ఓడ ప్రయాణంలో కాని దైవ కార్యాలు నిర్విఘ్నంగా జరిపించేవారు. 1844 సంవత్సరంలో బ్రిటన్‌ మరియు రన్నీమేడే అను రెండు భారీ ఓడలు భయంకరమైన సుడిగుండంలో చిక్కుకొని బ్రద్దలైపోయి అందు ప్రయాణిస్తున్న 600 మంది నావికులు, సైనికులు వారి కుటుంబాలు సుమారు రెండు నెలల కాలం ఒక నిర్జన దీవిలో చిక్కుకొనిపోయారు. అయినప్పటికీ ఆ రెండు నెలల కాలంలో కూడా ప్రతి ఆదివారం తప్పక ఆరాధన జరిపేవారు.

1863 నుండి 1923 వరకు అండమాన్‌ దీవులు వివిధ ప్రభుత్వ అధిపతుల ఆధీనంలో వుంటూ వుండేవి. తరువాతి కాలంలో 1942 వరకు క్రైస్తవ గురువుల నిర్వహణలో ఉండేవి. పోర్ట్‌ బ్లేయర్లోని క్రైస్ట్‌ చర్చిలో సేవలందించిన పీఠాధిపతుల జాబితానుCNI తయారు చేసింది. రెవరెండ్‌ వి.యం.కెంప్‌ జాబితాలోని చిట్టచివరి పీఠాధిపతి. జపాన్‌ వారు దీవులను ఆక్రమించిన తరువాత కెంప్‌ గారిని బంధించిరి. దైవ సేవకులే ప్రభుత్వాధిపతులైనప్పటికి స్థానిక ప్రజల, ఖైదీల ఆత్మీయ సంక్షేమాన్ని, అవసరాలను దృష్టిలో ఉంచుకొనెడివారు. రెవరెండ్‌ కోర్బిన్‌ నేటికీ గుర్తుంచుకోదగిన గొప్ప దైవజనులు. స్థానికులు నివసించే గృహాలు ఈయన ఆధీనంలోనే ఉండేవి. ఈయన గౌరవార్ధం పోర్టు బ్లెయర్‌లోని ప్రముఖ బీచ్‌కి కోర్బిన్స్‌ కేవ్‌ అని నామకరణం చేసారు.

20 వ శతాబ్దపు తొలి థకంలో, దీవులులోని క్రైస్తవ్యాన్ని గూర్చి FAM DASS తను రచించిన 'అండమాన్‌ ఐలాండ్స్‌' లో చక్కగా ప్రస్తావించాడు. ఈయన రికార్డుల ప్రకారం ప్రజలు మరియు అధికారులలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉండేవారు. నేరస్తులలో క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉండేవారు. క్రైస్తవ జనాభాలో రోమన్‌ కాథలిక్కులు మరియు చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ సభ్యులు అధిక భాగంగా ఉండెడివారు. ఇతర క్రైస్తవ సంఘ శాఖలు కూడా ఉనికిలో ఉండేవి. రాస్‌ ద్వీపములోని క్రైస్ట్‌ చర్చ్‌ని ఆంగ్లికన్స్‌ ఆరాధన కొరకు వాడుకొనేవారు. నియామక దిన కూడికలు, ఆదివారపు ఆరాధనలు స్థానిక సేవకునిచే జరిపింపబడేవి.

దాస్‌ గారు చెప్పియున్న దాన్ని బట్టి కేథలిక్‌ సంఘ కాపరి స్థానికంగా నివాసం ఉండేవాడు కాదు. అవసరాన్ని బట్టి రంగూన్‌ మరియు ఇతర ప్రాంతాలనుండి సేవకుల్ని ఆహ్వానించి స్థానిక ప్రజల ఆత్మీయ అవసరాల్ని తీర్చెడివారు.

1920 థకం ప్రారంభంలో అడవులలో పని చేయుటకుగాను బ్రిటీష్‌వారు అధిక సంఖ్యలో కార్మికుల్ని దీవులకు తీసుకొని వచ్చేవారు. వారిలో అత్యధికులు కారేన్స్‌ (Karens) తెగకు చెందినవారు. వీరు 1925 సంవత్సరములో బర్మాలోని బేస్సిన్‌ (Bassien) ప్రాంతం నుండి తీసుకొనిరాబడిరి. వీరిని బ్రిటీష్‌ బాప్టిస్ట్‌ మిషనరీలు ఆదరించి సాగు చేయుటకు మధ్య అండమాన్‌ దీవులలోని భూములను మంజూరు చేసెడివారు. నేటికిని వీరు స్థానిక జనాభాలో భాగమై యుండి జీవన విధానాన్ని కొనసాగిస్తూనే వున్నారు. దీవులలో వీరు అతి పెద్ద క్రైస్తవ సమూహంగా అవతరించింది.

అదే కాలంలో ఒప్పంద కార్మికులుగా (contract labour) అడవులలో పని చేయుటకు చోటా నాగపూర్‌ ప్రాంతం నుండి అనేకమందిని దీవులకు తీసుకొని వచ్చారు. ఈ వలసలో రోమన్‌ కేథలిక్‌ సంఘం ప్రధాన భూమిక పోషించింది. స్థానిక సమాజంలో నేడు వీరు పెద్ద గుంపుగా ఆవిర్భవించిరి. వీరి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో కాథలిక్‌ సంఘమే బాధ్యత వహిస్తుంది.

1926 సంవత్సరంలో రక్షణ సైన్య సువార్త సేవకులు భట్టు తెగకు చెందిన వారిని అధిక సంఖ్యలో ఈ దీవులకు తీసుకొని వచ్చారు. వీరు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం యొక్క ఉత్తర ప్రాంతానికి చెందిన నేర ప్రవృత్తి కలిగిన తెగగా పేరు గాంచినవారు. వీరు ఆ రాష్ట్రంలో బందిపోటు దొంగలుగా జీవించెడివారు. రెవరెండ్‌ షియార్డ్‌ నాయకత్వంలోని రక్షణ సైన్యం యొక్క సంరక్షణలో ఈ తెగకు చెందిన అనేకులు క్రైస్తవ్యాన్ని హత్తుకొనిరి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ వారు ఈ దీవులను ఆక్రమించుకొని రక్షణ సైన్యానికి చెందిన బ్రిగేడియర్‌ ఫ్రాన్సిస్‌ను హతమార్చారు.

  స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ ప్రాయోజిత నివాస పధకాల కారణంగా అనేకులు ఈ దీవులకు వలస వచ్చారు. వారిలో ఈ ప్రాంత అభివృద్ధి నిమిత్తం వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేయుటకు అనేకులు ప్రభుత్వోద్యోగులుగా వచ్చిరి. కేరళ, తమిళనాడు మరియు ఆంధ్ర ప్రాంతాలకు చెందిన అనేకమంది క్రైస్తవులు ఈ ద్వీపాలలో స్థిరనివాసమేర్పరచుకొనిరి. జనాభా పెరిగిన కొలది సంఘాల సంఖ్య కూడా పెరిగింది. అయితే భాషా ప్రాతిపదికను మరియు శాఖా ప్రాతిపదికననుసరించి మాత్రమే ప్రజల అవసరాలు తీర్చుటలో సంఘాలు పరిమితమైనాయి. నేడు 30 కంటే ఎక్కువ క్రైస్తవ సంస్థలు మరియు సంఘాలు కలసి 26 కంటె ఎక్కువ భాషా సమూహాలకు అండమాన్‌ దీవుల వ్యాప్తంగా సేవ చేయుచున్నారు.
అండమాన్‌
నికోబార్‌లో క్రైస్తవ్యం

అండమానీయులకంటే ముందుగానే నికోబారీయులు క్రైస్తవ ప్రభావానికి లోనయ్యారు.

12వ శతాబ్దంలోనే జేసుట్‌ బోధకులు నికోబార్‌ లో సువార్తీకరణను కాంక్షించిరి. కాని ప్రతికూల వాతావరణం, సౌకర్యాల కారణంగా అనేకులు మృతి చెందిరి. మరికొందరు స్థానికుల చేత సంహరింపబడిరి. అనేకులు ప్రతికూల వాతావరణానికి గురయ్యారు. 18వ శతాబ్దంలోనే మొరేవియన్‌ మిషనరీలు మరింత కృత నిశ్చయంతో సౌవార్తీకరణకు తెగించిరి. అయితే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 11 మంది దీవిలోను, 13 మంది ట్రాంక్విబార్‌కు తిరుగు ప్రయాణంలోను మృతి చెందిరి. వీరిలో సజీవుడుగా మిగిలిన చిట్టచివరి సహోదరుడు J.G.Hansel. ఇతడు సువార్తను విడచి దీవిని విడిచివెళ్లు సమయంలో పలికిన చివరి మాటలు ఏమనగా 'నాకు అప్పగింపబడిన బాధ్యతను నిర్వర్తించు క్రమంలో నా అంతరంగంలోని బాధను మాటలలో వ్యక్తీకరించలేను. అచ్చెరువుతో కన్నీరు విడచుట తప్ప నేను చేయగలిగినదేమీ లేదు.'

1807 సంవత్సరంలో రంగూన్‌కు చెందిన రోమన్‌ కాథలిక్‌ మిషనరీ దీవిలో సంఘ స్థాపనకు విఫలయత్నం చేసాడు. 1830-34 సంవత్సర కాలంలో ఒక క్రైస్తవ సముదాయాన్ని స్థాపించడానికి యత్నించి విఫలుడయ్యాడు.

ఘోరమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దట్టమైన అడవి, దీవులలోని చీకటి వాతావరణం, మూఢ నమ్మకాలు, ద్వీపవాసుల దయ్యాల ఆరాధనల ముందు మిషనరీల వీరచిత ప్రయత్నాలన్నీ తాత్కాలికంగా తలవంచక తప్పలేదు. నికోబారీయులు భూతవైద్యులు మరియు మాంత్రికుల ప్రాబల్యంలోనే వుండిపోయారు.

ఏమైనప్పటికీ చిట్టచివరి డానిష్‌ యాత్రికుని ప్రయత్నం అనంతరం 150 సంవత్సరముల తర్వాత నేటికి స్థానిక ద్వీపవాసులు ఎక్కువ శాతం క్రైస్తవులే. సంఘము యెడల వారికున్న భక్తికి దీవులకు వచ్చే యాత్రికులు సహితం ముగ్ధులయ్యేవారు. 1947లో ఈ దీవిని సందర్శించిన సర్‌ కాంప్టన్‌ మకెంజి మాటలు 'నా యొక్క కార్‌ నికోబార్‌ యాత్ర కాలంలో ఇక్కడ నేను చవిచూచిన మంచితనంలోని దైవశక్తిని నా జీవితములో మునుపెన్నడూ ఎరిగి యుండలేదు.' ఇంతటి అద్భుతమైన నెరవేర్పుకు 1895 సంవత్సరంలో నికోబార్‌ను సందర్శించిన తమిళ సువార్తికుడు వేదప్పన్‌ సోలోమోన్‌ మరియు జాన్‌ రిచర్డ్‌ సన్‌ ఇరువురూ కారకులు.

వేదప్పన్‌ గారు SPG మిషన్‌ ద్వారా నికోబార్‌ దీవులకు 1895 లో పంపబడ్డారు. అప్పటినుండి ఆయన మరణం 1909 వరకు నికోబారీల మధ్య భక్తితో సేవచేసియున్నాడు. ఆయన మరణానంతరం ఆయన భార్య అయిన సోలమన్‌ ఇక్కడ సేవను కొనసాగించి 1921లో ప్రభువు సన్నిధిని చేరినారు.

వేదప్పన్‌ సోలోమోన్‌ గారి ద్వారా ప్రభువునంగీకరించిన మొదటి వ్యక్తి రిచర్డ్‌ సన్‌. ఆ తరువాతి కాలంలో రిచర్డ్‌ సన్‌ గారు ఉపాధ్యాయ మరియు సువార్తికుడి శిక్షణ కొరకు బర్మాలోని మాన్డలేకి పంపబడిరి. 1912 లో బర్మా నుండి తిరిగి వచ్చి శ్రీమతి సోలోమన్‌ గారితో ఆమె ప్రభువు సన్నిధి చేరువరకు ఆమెకు సహచరుడిగా పనిచేసినారు. SPG   మిషన్‌ వారిచే పంపబడిన పండితుడైన సేవకుడు రెవ.జార్జ్‌ వైట్‌ హెడ్‌గారు బైబిల్‌ తర్జుమా చేయుటలో రిచర్డ్‌ సన్‌ గారికి సహకరించిరి. ఇరువురు కలిసి బైబిల్‌లోని నాలుగు సువార్తలు, అపోస్తలుల కార్యముల గ్రంధాన్ని తర్జుమా గావించిరి. జార్జ్‌ వైట్‌ హెడ్‌ మరణానంతరం రిచర్డ్‌ సన్‌ గారు క్రొత్త నిబంధన మిగిలిన భాగాన్ని నికోబారీల భాషలోనికి అనువదించిరి. ఈ మహత్కార్యము నికోబారీల మొత్తము తెగ క్రైస్తవ క్రైస్త్యము లోనికి నడిపింప బడడానికి ప్రధాన కారణమయింది.

1934 వ సంవత్సరంలో రిచర్డ్‌ సన్‌ గారు రంగూన్‌లో సేవకుడిగా అభిషేకించబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ దేశము ఈయనకు రెండు పర్యాయములు మరణ శిక్షను విధించింది. అయినాను ఆశ్చర్యకరంగా తప్పింపబడ్డారు. 1950 లో స్పెషల్‌ బిషప్‌గా నియమించబడిరి. తదుపరి పార్లమెంట్‌ సభ్యునిగా కూడా నియమితులయ్యారు.

అండమాన్స్‌ లో తెలుగు క్రైస్తవ్యపు కాంతి పుంజాలు

1858 లో అండమాన్స్‌లో కర్కశ కారాగార శిక్ష ప్రారంభించిన నాటినుండి తెలుగు వారు కూడా ఈ దీవిపై ఉనికిని కలిగి వున్నట్లు దాఖలాలున్నాయి. అయితే 1961 శ్రీ ఎం.జి.మెషేక్‌ రాసిన ఒక సంఘ రిజిస్టర్‌ని బట్టి తెలుగు క్రైస్తవ సంఘం గూర్చి కొంత సమాచారం తెలుస్తూంది. దీనిని బట్టి మెషేక్‌తో బాటు కె.ఎస్‌.రావ్‌, డి.సామ్యుల్‌ అనే మరో ఇద్దరు 1958 లో ఈ దీవికి వచ్చి క్రిస్మస్‌ దినాన ఆరాధన స్థలం గూర్చి వెతకడం జరిగింది. హెడ్డో లో ఒక మందిరాన్ని చూచి అక్కడ ద్వారా పాలకునిగానున్న వ్యక్తిని కలిసి ఆ మందిరంలో ఆరాధించుకోవచ్చానని అడిగాడు. వీరు తెలుగు మాట్లాడడం గమనించిన జి.సామ్యుల్‌ అనే సహోదరుడు వీరిని పాస్టర్‌ తంగరాజ్‌ వద్దకు తోడుకొని వెళ్ళాడు. పాస్టర్‌ తంగరాజ్‌ వారితో ఆప్యాయంగా అచ్చ తెలుగు భాషలో మాట్లాడి ఆరాధనకు ఆహ్వానించాడు. అతి త్వరలోనే ముగ్గురు తొమ్మండుగురుగా పెరిగారు. 1960 లో కొంతమంది క్రైస్తవేతరులు కూడా వీరితో కలిసి ఆరాధనలో పాల్గొనడం మొదలు పెట్టారు. వీరందరూ కలిసి ఆంధ్ర ప్రాంతం నుండి అనేకులు ఈ దీవులకు రావాలనీ, తెలుగు సంఘం ప్రారంభం కావాలనీ కన్నీళ్ళతో ప్రార్ధించారు.

అనూహ్యమైన రీతిలో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి 150 మంది పనివారిని మెయిన్‌ లాండ్‌ నుండి తీసుకు రావలసిందిగా అండమాన్‌ ప్రభుత్వం మెషేక్‌ను కోరింది. మెషేక్‌ తెచ్చిన వారిలో కొందరు క్రైస్తవులు కూడా వున్నారు. వీరిని ప్రభుత్వం దిగ్లిపూర్‌, ఫెర్రర్‌ గుంజ్‌ హేవ్లాక్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాలకు పంపింది. ఈ పనివారిలో నున్న క్రైస్తవుల ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగు సంఘాలు స్థాపించబడ్డాయి.

1961లో సుమారు వంద మంది తెలుగు క్రైస్తవులతో 'ఆంధ్రా తెలుగు క్రిస్టియన్‌ మెథడిస్ట్‌ కాంగ్రిగేషన్‌ స్థాపించబడింది.

ఆది క్రైస్తవ మిషనరీల అవిరళ కృషి, త్యాగాల ఫలితంగా దీవులన్నిటిలో క్రైస్తవ్యం స్థిరపరచబడింది. ఒక శతాబ్దం కంటే తక్కువ కాల వ్యవధిలో అండమాన్‌ నికోబార్‌ దీవులలో క్రైస్తవ్యం అనూహ్యమైన విధంగా విస్తరించింది.

1906 నాటికి కేవలం 451 మందిగా నున్న క్రైస్తవులు 2001 నాటికి 77178 గా ఎలా తయారయ్యారు? దీనికి కారణం మిషనరీల నిస్వార్ధ సేవేనని చెప్పక తప్పక తప్పదు. 

- డా||ఫ్రాన్సిస్‌ జేవియర్‌ నీలం